కొత్తగూడెం: ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్
*రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియ – సన్న రకం ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్*
*ధాన్యం నిల్వకు ముందస్తు ఏర్పాట్లు – ప్రతి గింజ తడవకుండా పటిష్ట చర్యలు చేపట్టాలి*
వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐ.డి.ఓ.సి. సమావేశ మందిరంలో జిల్లా పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వానాకాలం ధాన్యం కొనుగోలు సన్నాహక సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్‌తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిలు, వ్యవసాయ, సహకార, డీఆర్డీఏ, తూనికలు–కొలతలు, రవాణా, మార్కెటింగ్ శాఖల అధికారులు, రైస్ మిల్లర్లు సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వానాకాలం సీజన్లో సుమారు 1,28,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ఇందులో 1,24,119 మెట్రిక్ టన్నుల సన్న రకం, 3,881 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యం ఉంటుందని తెలిపారు. ధాన్యం కొనుగోలుకు జిల్లాలో 190 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అవసరాన్ని బట్టి అదనపు కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
రైతులు పండించిన ధాన్యానికి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాకు రూ.2,461, సాధారణ గ్రేడ్ ధాన్యానికి రూ.2,441 మద్దతు ధరగా నిర్ణయించబడిందని తెలిపారు. సన్న రకం ధాన్యానికి మద్దతు ధరతో పాటు అదనంగా క్వింటాకు రూ.500 బోనస్ అందజేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో BPT 5204, RNR 15048, HMT సోనా, జైశ్రీరామ్ సిగ్మెంటల్, KNM 1638, WGL 44, KNM 7715 అనే ఏడు రకాల సన్న వడ్లకు ఈ బోనస్ వర్తిస్తుందని తెలిపారు. దీంతో సన్న రకం ధాన్యానికి క్వింటాకు మొత్తం రూ.2,961 వరకు లభించేలా కొనుగోలు ప్రక్రియ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ప్రతి కొనుగోలు కేంద్రంలో తాగునీరు, టార్పాలిన్లు, తేమ కొలిచే యంత్రాలు, తూకపు పరికరాలు, గన్నీ సంచులు తదితర అవసరమైన వసతులను ముందుగానే సమకూర్చుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో ఎంఎస్పీ ధరలు, నాణ్యత ప్రమాణాలు, తేమ శాతం, సన్న రకం ధాన్యానికి అందించే బోనస్, సంబంధిత అధికారుల వివరాలను స్పష్టంగా ప్రదర్శించాలని సూచించారు. సన్న రకం, దొడ్డు రకం ధాన్యం కోసం అవసరమైన విధంగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు.
పొరుగు రాష్ట్రాల నుంచి జిల్లాలోకి ధాన్యం అక్రమంగా తరలివచ్చే అవకాశాలను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు సరిహద్దుల్లో పటిష్ట నిఘా కొనసాగించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. రైతులు ధాన్యం విక్రయానికి వచ్చేటప్పుడు ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్, పట్టాదారు పాస్‌బుక్ జిరాక్స్ ప్రతులను వెంట తీసుకురావాలని సూచించారు.
రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి, కొనుగోలు రసీదులు అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. రైతులకు చెల్లింపులు సకాలంలో జరిగేలా అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో నాణ్యత ప్రమాణాలు, మద్దతు ధర, బోనస్, ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధిత అధికారుల వివరాలను స్పష్టంగా ప్రదర్శించాలని తెలిపారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని ఎక్కువ కాలం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ చేయకుండా తక్షణమే రైస్ మిల్లులకు తరలించేలా రవాణా ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని ఆదేశించారు.
ధాన్యం నాణ్యతా ప్రమాణాల పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేయడం, తరుగు పేరుతో అన్యాయంగా కోతలు విధించడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిలు, సంబంధిత రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రైతులకు ధాన్యం విక్రయ ప్రక్రియ, మద్దతు ధర, నాణ్యతా ప్రమాణాలు, సన్న రకం ధాన్యానికి లభించే బోనస్‌పై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.
కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలకు తప్పనిసరిగా ట్యాగ్, కొనుగోలు కేంద్రం నంబర్ వేయాలని, కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను త్వరితగతిన రైస్ మిల్లులకు తరలించాలని కలెక్టర్ ఆదేశించారు. ధాన్యం నిల్వకు అవసరమైన గోడౌన్లు, ఫంక్షన్ హాళ్లు, ఇతర అనువైన భవనాలను ముందుగానే గుర్తించి సిద్ధంగా ఉంచాలని సూచించారు. వర్షాల కారణంగా ఏ ఒక్క ధాన్యం గింజ కూడా తడవకుండా టార్పాలిన్లు, ఇతర రక్షణ ఏర్పాట్లు ముందుగానే సిద్ధం చేసుకోవాలని తెలిపారు.
పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్లను వారి పరిధిలోని ధాన్యం నిల్వ సామర్థ్యం, అంచనా ధాన్యం పరిమాణం, అందుబాటులో ఉన్న నిల్వ సౌకర్యాలకు సంబంధించిన వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అయితే కొంతమంది అధికారులు అడిగిన వివరాలపై సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ పరిధిలోని ధాన్యం నిల్వ సామర్థ్యం, అంచనా ధాన్యం పరిమాణం వంటి కీలక అంశాలపై అధికారులకు పూర్తి అవగాహన లేకపోవడం ఏమాత్రం సమంజసం కాదని అన్నారు. విధులకు సంబంధించిన ప్రాథమిక వివరాలపై స్పష్టత లేకుండా పనిచేయడం సరికాదని, ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
అక్టోబర్ 1వ తేదీ నాటికి అన్ని కొనుగోలు కేంద్రాలను తప్పనిసరిగా ప్రారంభించేలా అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. తూకపు బాట్లను ముందుగానే తనిఖీ చేసి సీల్స్ వేయాలని తూనికలు–కొలతల శాఖ అధికారులకు సూచించారు. వర్షాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం రక్షణకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి ధాన్యం కొనుగోలు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.
2026–27 రబీ సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్ డెలివరీలను సకాలంలో పూర్తి చేసేలా రైస్ మిల్లులను తనిఖీ చేసి, వాస్తవ పరిస్థితులపై నివేదికలు సమర్పించాలని పౌర సరఫరాల శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, పౌర సరఫరాల అధికారి ప్రేమ్ కుమార్ , పౌర సరఫరాల సంస్థ మేనేజర్ త్రినాధ్ బాబు, జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, రవాణా శాఖ అధికారి భూషిత్ రెడ్డి , మార్కెటింగ్ అధికారి అలీమ్ , రైస్ మిల్లర్ అసోసియేషన్ ప్రతినిధులు ఆనందరావు, కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిలు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.