కొత్తగూడెం: *పాఠశాల, ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్*
*విద్యార్థులకు నాణ్యమైన బోధన, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్ అంకిత్*
చుంచుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పాత కొత్తగూడెం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్)ను జిల్లా కలెక్టర్ అంకిత్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న బోధన, ఉపాధ్యాయుల హాజరు, విద్యా ప్రమాణాలు, పరిసరాల పరిశుభ్రతతో పాటు ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, మందుల నిల్వలు, సిబ్బంది హాజరు, ల్యాబొరేటరీ సేవలను పరిశీలించారు.
ముందుగా చుంచుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్ పాఠశాల ఆవరణను పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయుల హాజరు పట్టికను తనిఖీ చేసి విధులకు హాజరైన, సెలవులో ఉన్న ఉపాధ్యాయుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. హాజరు పట్టికలో నమోదైన వివరాలకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఆయా తరగతి గదుల్లో అందుబాటులో ఉన్నారా లేదా అనే అంశాన్ని స్వయంగా పరిశీలించారు.
వివిధ తరగతి గదులను సందర్శించిన కలెక్టర్ విద్యార్థులతో నేరుగా మాట్లాడి పాఠ్యాంశాలపై వారి అవగాహనను తెలుసుకున్నారు. విద్యార్థులకు అందుతున్న బోధన, వారి అభ్యసన స్థాయిని పరిశీలించారు. పదో తరగతి తరగతి గదిలో ఉపాధ్యాయుడు అందుబాటులో లేకపోవడంపై కలెక్టర్ ఆరా తీశారు. ఇందుకు సరైన సమాధానం లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవికి షోకాజ్ నోటీసు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.
విద్యార్థుల విద్యాభ్యాసానికి ఎలాంటి ఆటంకం కలగకుండా ఉపాధ్యాయులు నిరంతరం పాఠ్యాంశాలను బోధించాలని, తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం, గత విద్యా ఫలితాలు, ప్రస్తుత విద్యా ప్రగతికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల విద్యా ప్రమాణాల మెరుగుదలకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వెనుకబడిన విద్యార్థులపై అదనపు దృష్టి సారించాలని సూచించారు. పాఠశాల పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.
అనంతరం పాత కొత్తగూడెం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఆరోగ్య కేంద్రం పరిసరాలను పరిశీలించిన కలెక్టర్, వైద్యాధికారితో మాట్లాడి కేంద్రం ద్వారా ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు, రోజువారీగా వచ్చే ఓపీ రోగుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజూ సుమారు 50 నుంచి 60 మంది వరకు ఓపీకి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. రోగుల సంఖ్యకు అనుగుణంగా వైద్య సేవలు, మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఆరోగ్య కేంద్రంలోని ఇన్‌పేషెంట్ విభాగాన్ని పరిశీలించిన కలెక్టర్ చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి, అందుతున్న వైద్య సేవలు, మందుల పంపిణీ తదితర వివరాలను తెలుసుకున్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన వైద్య సేవలను అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.
అనంతరం స్టోర్ రూమ్‌ను పరిశీలించిన కలెక్టర్ మందుల నిల్వలను తనిఖీ చేశారు. అవసరమైన అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయా లేదా అనే వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మందులను నిబంధనల ప్రకారం సక్రమంగా నిల్వ చేయాలని, మందుల గడువు తేదీలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. గడువు ముగిసిన మందులను గుర్తించి నిబంధనల ప్రకారం వెంటనే తొలగించాలని ఆదేశించారు. అవసరమైన మందులు, వైద్య పరికరాలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా ముందస్తుగా ఇండెంట్ పెట్టి సరఫరా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఆరోగ్య కేంద్రంలోని సిబ్బంది హాజరు పట్టికను కూడా కలెక్టర్ పరిశీలించారు. విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకుని, ప్రతి ఒక్కరూ విధులకు సక్రమంగా హాజరవుతూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఆరోగ్య కేంద్రంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
ల్యాబొరేటరీని పరిశీలించిన కలెక్టర్ ల్యాబ్ టెక్నీషియన్‌తో మాట్లాడి రోగులకు నిర్వహిస్తున్న రక్త పరీక్షలు, డెంగ్యూ, మలేరియా నిర్ధారణ పరీక్షల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మలేరియా నిర్ధారణ కిట్లు అందుబాటులో ఉన్నాయని, డెంగ్యూ నిర్ధారణ కిట్ల కోసం ఇప్పటికే ఇండెంట్ పెట్టినట్లు సిబ్బంది కలెక్టర్‌కు వివరించారు. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో అవసరమైన పరీక్షా కిట్లు, మందులు ముందుగానే అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు.
పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు అందుతున్న సేవల నాణ్యతపై సంబంధిత అధికారులు, సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని కలెక్టర్ అంకిత్ సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, ప్రజలకు సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందేలా సంబంధిత అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు.
ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట తాసిల్దార్ నాగరాజు, ఎంఈఓ నీరజ, పట్టణ ఆరోగ్య కేంద్రం మెడికల్ అధికారి, నర్సులు సిబ్బంది సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.