మణుగూరు: *అశ్వాపురంపాడు గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్*
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు, కరకగూడెం పోలీసుల ఆధ్వర్యంలో కరకగూడెం మండలం అశ్వాపురంపాడు గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.ఆపరేషన్లో భాగంగా గ్రామంలోని ఇళ్లను తనిఖీ చేసి, అనుమానాస్పద వ్యక్తులు, అక్రమ కార్యకలాపాలు మరియు నేరాలకు సంబంధించిన అంశాలపై పోలీసులు ఆరా తీశారు. గ్రామంలో నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ రవీందర్ రెడ్డి గ్రామస్థులతో మాట్లాడుతూ, ఈ ఏడాది అశ్వాపురంపాడు గ్రామంలో మూడు నేర ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో నేరాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామంలో నేరాలు పునరావృతం కాకుండా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
గ్రామంలో ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తున్నా, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని గ్రామస్థులకు తెలిపారు.
అనంతరం గ్రామంలోని చిన్నారులకు దుస్తులను పంపిణీ చేశారు. పోలీసు శాఖ కేవలం శాంతిభద్రతల పరిరక్షణకే పరిమితం కాకుండా, ప్రజలతో మమేకమై వారి సంక్షేమానికి కూడా కృషి చేస్తుందని తెలిపారు. గ్రామస్థులు ఎలాంటి సమస్య ఉన్నా పోలీసుల దృష్టికి తీసుకురావాలని, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వర్లు , ఎస్సై పివిఎన్ రావు , పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.