ఇల్లందు: *గుండాల, బోడు, కొమరారం పోలీస్ స్టేషన్లను సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్*
*సీసీటీఎన్ఎస్ 2.0లో కేసుల వివరాలను సకాలంలో నమోదు చేయాలి*
*సమస్యలతో వచ్చే బాధితులకు న్యాయం చేకూరుతుందనే భరోసా కల్పించాలి*
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ మంగళవారం గుండాల, బోడు, కొమరారం పోలీస్ స్టేషన్లను సందర్శించి తనిఖీ చేశారు. గుండాల పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీ నిర్వహించి, పోలీస్ స్టేషన్లలో రికార్డులు, సిబ్బంది విధుల నిర్వహణ, కేసుల దర్యాప్తు పురోగతిని పరిశీలించారు.
గుండాల పోలీస్ స్టేషన్ను పరిశీలించిన సందర్భంగా కాంపౌండ్ వాల్, గార్డ్ పోస్ట్ మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, స్టేషన్ ప్రాపర్టీ భద్రతకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ల పరిసరాలను పరిశీలించి, పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులు, పెండింగ్ దర్యాప్తుల వివరాలను అడిగి తెలుసుకొని, పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సీసీటీఎన్ఎస్ 2.0లో కేసుల నమోదు, దర్యాప్తు పురోగతి, ఇతర వివరాలను సకాలంలో నమోదు చేసి ఎప్పటికప్పుడు నవీకరించాలని, పోలీసింగ్ వెబ్ అప్లికేషన్లపై ప్రతి పోలీస్ సిబ్బంది పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
పోలీస్ స్టేషన్కు వివిధ సమస్యలతో వచ్చే బాధితులతో బాధ్యతగా వ్యవహరించి, వారికి న్యాయం చేకూరుతుందనే భరోసా కల్పించాలని తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై నిఘా ఉంచి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సైబర్ నేరాలపై గ్రామాల్లో ప్రజలకు నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు.అనంతరం పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది సమస్యలను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో సీఐలు తిరుపతి, సత్యనారాయణ, ఎస్ఐలు, శ్రవణ్ కుమార్, రాజమౌళి, నాగుల్ మీరా, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.